Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్టరీగా మారిన మైఖేల్ జాక్సన్ మరణం

Advertiesment
మైఖేల్ జాక్సన్
DBMG
పాప్ ప్రపంచాన్ని ఒక్కసారిగా శోక సముద్రంలో ముంచేసిన మైఖేల్ జాక్సన్ మరణం ఒక మిస్టరీగా మారింది. సహజ మరణమేనని వైద్యులంటున్నా, మైఖేల్ వ్యక్తిగత వైద్యుడు జాక్సన్ మరణం తర్వాత కనిపించకుండా వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మైఖేల్ మరణించడానికి కొద్ది నిమిషాల ముందు ఆ వైద్యుడు జాక్సన్‌కు ఓ ఇంజెక్షన్ చేశాడట. ఆ ఇంజెక్షన్ ప్రభావం వల్ల మైఖేల్ చనిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే అది నిజం కాదని మరికొందరు వాదిస్తున్నారు. పుట్టెడు అప్పుల్లో ఉన్న జాక్సన్ పూర్తి ఒత్తిడితో గత కొన్ని నెలలుగా సతమతమవుతున్నాడనీ, ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు అనేకమైన మార్గాలను అవలంభించాడని, వాటి దుష్పరిణామాల ప్రభావం కారణంగానే మైఖేల్ మృత్యువాత పడి ఉంటాడని అంటున్నారు.

ఇదిలావుండగా మైఖేల్ జాక్సన్ భౌతిక కాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తరువాత కూడా ఆయన మరణానికి వైద్యులు స్పష్టమైన కారణాలేవీ వెల్లడించలేదు. మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాతగానీ జాక్సన్ మరణానికి కారణాలు తెలియజేయగలమని లాస్ ఏంజెలెస్ వైద్యులు చెప్పారు.

జాక్సన్ భౌతికకాయానికి శవపంచనామా పూర్తయినా, ఆయన మరణానికి గల స్పష్టమైన కారణాలు తెలియకపోవడంతో.. మీడియాలో వివిధ రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మరణానికి నార్కోటిక్ మందులతో కుట్ర జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి.

శవపంచనామా నిర్వహించిన వైద్యులు మాత్రం జాక్సన్ అసహజ మరణం చెందారనే వాదనను బలపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కొన్నేళ్లపాటు పాప్ సంగీత ప్రపంచాన్ని శాసించిన మైఖేల్ జాక్సన్ గురువారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

మరణానికి కొన్ని గంటల ముందు మాదకద్రవ్య పెయిన్‌కిల్లర్స్‌ను మైఖేల్ జాక్సన్ శరీరంలోకి చొప్పించినట్లు ఆయన కుటుంబ న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వివిధ కోణాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

అధికారిక వర్గాలు మాత్రం జాక్సన్ మరణానికి స్పష్టమైన కారణాలు వెల్లడించేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని, వీటి నివేదికలు వచ్చేందుకు మూడు నుంచి నాలుగు వారాలు పడుతుందని చెబుతున్నాయి. ఇందుకు టాక్సాలజీ వంటి కొన్ని ఇతర పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu