స్వాత్ లోయలో పాకిస్తాన్ దళాలకు సహాయంగా అమెరికా తమ సేనలను పంపిస్తుందన్న ఊహాగానాల నేపధ్యంలో, తమకు అటువంటి ఉద్దేశ్యం ఏదీ లేదని బారక్ ఒబామా తేల్చి చెప్పారు.
తాలిబన్లను సమర్థవంతంగా ఎదుర్కొనగల శక్తి పాకిస్తాన్‌కి ఉన్నదనీ, పాక్ దళాలు అత్యంత చాకచక్యంగా పోరు సాగిస్తున్నాయన్నారు. తాలిబన్లపై పాక్ చేస్తున్న దాడి సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
కొందరు అనుకుంటున్నట్లుగా పాక్‌కు సహాయమందించే దిశగా అమెరికా తమ దళాలను పంపిస్తుందన్న వార్తలో నిజం లేదన్నారు. అసలు తమకు అటువంటి ఉద్దేశ్యమేదీ లేదన్నారు.
ఒకవేళ పాక్‌లో ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు రుజువైతే అమెరికా సేనలు పాకిస్తాన్‌కు వెళతాయా...? అని ఒక విలేకరి ప్రశ్నించినపుడు ఒబామా స్పందిస్తూ, ఉమ్మడి శత్రువులను తుదముట్టించేందుకు అన్ని దేశాలు ముందుకు వస్తాయన్నారు. అయితే ఆ పోరులో అమాయకులైన ప్రజలు బలికావడానికి తాము సుతారము ఇష్టపడమని ఒబామా తెలియజేశారు.
పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాదులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందనీ, పాక్ దళాలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదుల పనిపడుతున్నారని ఒబామా ప్రశంసల జల్లు కురిపించారు.