Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో భారతీయ విద్యార్థిపై దాడికి పాల్పడ్డ ఆస్ట్రేలియన్లు

మరో భారతీయ విద్యార్థిపై దాడికి పాల్పడ్డ ఆస్ట్రేలియన్లు
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై భవిష్యత్తులో దాడులు జరగవని రెండు దేశాల ప్రభుత్వాలు చెప్పిన కొద్ది రోజులలోనే మళ్ళీ తాజాగా మరో దాడి జరిగింది. ఇద్దరు ఆస్ట్రేలియా జాత్యహంకారులు భారతీయ విద్యార్థిపై బేస్‌బాల్‌ క్రీడకుపయోగించే బ్యాట్‌తో దాడి చేశారు. దీంతో ఆ విద్యార్థి తలకి తీవ్ర గాయమై ఇరవై కుట్లు పడ్డాయి.

ఈ ఘటన అక్కడి కీలోర్‌ ప్లైన్స్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుందని స్థానిక పత్రిక 'ఏజ్‌' పేర్కొంది. అయితే విద్యార్థి పేరును నిర్ధారించవలసి ఉందని ఆ పత్రిక పేర్కొంది. ఆ పత్రిక తెలిపిన వివరాలమేరకు... భారతీయ విద్యార్థి గత నెల 29న కీలోర్‌ ప్లైన్స్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో అర్ధరాత్రి 12.15 గంటలకు బస్సు దిగి నడిచి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు ఆ విద్యార్థిని అనుసరించారు. అతనిని అడ్డగించి తమకు సిగరెట్లు కావాలని కాసేపు గొడవపడ్డారు.

ఆ తర్వాత విద్యార్థి తన వద్ద ఉన్న ఒక సిగరెట్‌ను వారికి ఇచ్చి తన దారిన తాను నడిచాడు. అంతలోనే ఆగ్రహించిన దుండగులు విద్యార్థిని వెనుక వైపుగా అనుసరించి తమతో అప్పటికే తెచ్చుకున్న బ్యాట్‌తో విద్యార్థి తలపై కనీసం ఆరు సార్లు తీవ్రంగా బాదడంతో అతను తీవ్ర గాయాల పాలైనట్లు పోలీలసులు తెలిపారు.

దీంతో అతనికి రక్తస్రావం అధికమై అపస్మారక స్థితికి చేరుకున్నాడని ఆ పత్రిక తెలిపింది. గడచిన నాలుగు నెలలుగా ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులు 33 మందిపై జాత్యహంకార దాడులు జరిగినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu