Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భుట్టో హత్యపై దర్యాప్తు ప్రారంభించిన ఐరాస

Advertiesment
ఐరాస కమిషన్
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్యపై దర్యాప్తు చేపట్టేందుకు ఏర్పాటయిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) కమిషన్ బుధవారం విధులు స్వీకరించింది. బేనజీర్ భుట్టో హత్యపై ఐరాస కమిషన్ ఈ రోజు విచారణ ప్రారంభించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆరు నెలల గడుపుతో ఈ కమిషన్ పనిచేస్తుంది.

అమెరికాలో చిలీ దౌత్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న హెరాల్డో మునోజ్ భుట్టో హత్యపై దర్యాప్తు జరిపే ఐరాస కమిషన్‌కు నేతృత్వం వహిస్తారు. ఇందులో ఇండోనేషియా మాజీ మిలిటరీ అధికారి, ఐర్లాండ్ మాజీ పోలీసు అధికారి కూడా సభ్యులుగా ఉంటారు. పాకిస్థాన్‌‍కు తొలి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన బేనజీర్ భుట్టో 2007 డిసెంబరు 27న హత్యకు గురైయ్యారు.

పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని రావల్పిండిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న బేనజీర్ భుట్టోపై ఆత్మాహుతి దాడి జరిగింది. అనంతరం ఆమెపై సాయుధాలు కాల్పులు కూడా జరిపారు. ఈ దాడిలో బేనజీర్ భుట్టో ప్రాణాలు కోల్పోయారు. భుట్టో హత్యపై ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించి ఐరాస కమిషన్ సభ్యులు త్వరలోనే పాకిస్థాన్ వెళ్లనున్నారు. వారి పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

బేనజీర్ భుట్టో హత్యపై ఈ కమిషన్ విచారణ జరిపి నివేదిక సమర్పిస్తుంది. భుట్టో హత్యకు గల కారణాలు, దారితీసిన పరిస్థితులను కమిషన్ తన నివేదికలో వివరిస్తుంది. అయితే కమిషన్ నిందితులుగా పేర్కొనేవారిపై చర్యలు తీసుకోవడం పాకిస్థాన్ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu