దేశంలో ఉద్రిక్తతలకు కారణమైన హింసాత్మక ఆందోళనలకు ఆజ్యం పోశారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన బ్రిటన్ దౌత్యకార్యాలయ సిబ్బందిని విడిచిపెట్టడం ఇప్పుడు న్యాయవ్యవస్థ చేతుల్లో ఉందని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 12న జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇరాన్లో గత మూడు వారాలుగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఆందోళన కారణంగా ఇరాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్లో పరిస్థితులపై అమెరికా, బ్రిటన్సహా పశ్చిమదేశాలు స్పందించడం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలో అశాంతిని రెచ్చగొట్టారనే ఆరోపణలపై బ్రిటన్ దౌత్యకార్యాలయ స్థానిక సిబ్బందిని అరెస్టు చేసింది. ఈ పరిణామంపై బ్రిటన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిని వెంటనే విడుదల చేయాలని బ్రిటన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. తాజా పరిణామంపై ఇరాన్ అధికారులు మాట్లాడుతూ.. వారిని విడిచిపెట్టడం ఇప్పుడు తమ దేశ న్యాయవ్యవస్థ చేతుల్లో ఉందని తెలిపారు.
ఇరాన్ నిఘా వ్యవహారాల శాఖ మంత్రి గులామ్ హుస్సేన్ మొహసీని ఎజెహీ మాట్లాడుతూ.. బ్రిటన్ దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న ఇరాన్ సిబ్బంది దేశంలో ఉద్రిక్తతలకు ఆజ్యం పోశారనేందుకు తమ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్ష మద్దతుదారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణల్లో వీరి ప్రమేయం ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు ప్రభుత్వ యంత్రాంగానికి దొరికాయని తెలిపారు. తదుపరి చర్యలను న్యాయవ్యవస్థ నిర్దేశిస్తుందన్నారు.