ఐక్యరాజ్యసమితి సాంకేతిక కమిటీకి చెందిన ఇద్దరు సభ్యులు పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్య జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. 2007 డిసెంబరులో రావల్పిండిలో జరిగిన ఉగ్రవాద దాడిలో బేనజీర్ భుట్టో హత్యకు గురైన సంగతి తెలిసిందే. భుట్టో హత్యపై దర్యాప్తును పాకిస్థాన్ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఐరాస చేపట్టింది.
భుట్టో హత్యపై దర్యాప్తు జరిపే ఐక్యరాజ్యసమితి అధికార కమిటీ పాకిస్థాన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. భుట్టో హత్యపై దర్యాప్తుకు ఇటీవల ఏర్పాటయిన ఐరాస కమిటీ త్వరలో హత్య జరిగిన ప్రదేశాన్ని సందర్శించనుందని పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. రావల్పిండిలోని లియాక్వాట్ బాగ్ వద్ద భుట్టో హత్య జరిగింది.
ఈ ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు తాజాగా ఇద్దరు ఐరాస అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. భుట్టో హత్యకు గత వాస్తవ కారణాలు, అందుకు దారితీసిన పరిస్థితులపై ఐరాస ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ దర్యాప్తు జరుపుతుంది. దీని కోసం ఈ కమిటీ సభ్యులు త్వరలోనే పెషావర్‌లో పర్యటించనున్నారు.
తాజాగా ఇక్కడ పర్యటించిన ఐరాస అధికారులు భుట్టో హత్యకు గురైన ప్రదేశం ఛాయాచిత్రాలు తీసుకున్నారు. అంతేకాకుండా ఊహాచిత్రాలు తయారు చేసుకున్నాడు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బేనజీర్ చివరిసారి ప్రసంగించిన వేదికను కూడా ఐరాస అధికారులు పరిశీలించారని మీడియా కథనాలు వెల్లడించాయి.