ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ప్రపంచ భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తానని ఆ సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పలు అరబ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తలను నివారించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. లిబియా వంటి దేశాల్లో ప్రజాస్వామికీకరణ, స్థిరమైన అభివృద్ధి అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం, ప్రాంతీయ భద్రత, ప్రజాస్వామిక సంస్కరణలను శాంతియుతంగా అమలు చేయడం వంటి అంశాలకు తన ఈ రెండో దఫా పదవీకాలంలో ప్రాధాన్యమిస్తున్నట్లు మూన్ కొరియా రాజధాని సియోల్‌లో వెల్లడించారు.
ఈజిప్టు, టునీషియాల్లో అధికార మార్పిడికి తాము మద్దతు ఇస్తున్నామని, ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోందని మూన్ వివరించారు. అలాగే లిబియాలో నెలకొన్న సంఘర్షణకు ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు దౌత్యపరమైన కృషి కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.