పెరు సుప్రీంకోర్టు సోమవారం ఆ దేశ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమొరికి ఓ అవినీతి కేసులో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఫుజిమొరి తన గూఢచర్య విభాగాధిపతికి 15 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన కేసులో ఫుజిమొరిని సుప్రీంకోర్టు దోషిగా పరిగణించి 7.5 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
2007లో ప్రవాసం నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఫుజిమొరికి కోర్టు శిక్ష విధించడం ఇది మూడోసారి. 1990 నుంచి 2000 వరకు దక్షిణ అమెరికా ఖండంలోని పెరు దేశానికి ఫుజిమొరి అధ్యక్షుడిగా పనిచేశారు.
నిధుల దుర్వినియోగం, ఇతర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫుజిమొరి తాజా కేసులో మాజీ సహాయకుడు, ఇంటెలిజెన్స్ చీఫ్ వ్లాదిమిరో మోటెసినోస్‌కు అక్రమంగా 15 మిలియన్ డాలర్ల బోనస్ చెల్లించినట్లు వచ్చిన ఆరోపణలు నిర్ధారణ అయ్యాయి. పెరు సుప్రీంకోర్టు ఆయనకు సోమవారం అంతర్జాతీయ కాలమానం ప్రకారం 1700 గంటల సమయంలో ఏడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది.