పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ ఆ దేశ ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. పాక్ అధికారిక యంత్రాంగంపై తన నియంత్రణను విస్తరించుకుంటున్నారనే వాదనను బలపరిచేందుకు ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలే నిదర్శనాలు.
వీటిని పరిశీలిస్తే.. ఇటీవల పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఎంపిక చేసిన ఓ దౌత్యాధికారి నియామకాన్ని గిలానీ రద్దు చేశారు. అంతేకాకుండా జర్దారీ సన్నిహితులైన ముగ్గురు మంత్రులను తొలగించేందుకు కూడా గిలానీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది సాధారణ ఎన్నికల తరువాత గిలానీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించే సమయంలో, ఆయన జర్దారీకి కేవలం "యస్ మెన్" (కీలుబొమ్మ) అవతారని అనేక మంది రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవలి నెలల్లో అధ్యక్షుడి నిర్ణయాలతో కొన్ని సందర్భాల్లో గిలానీ విభేదించారని పార్టీ వర్గాలు తెలిపాయి.