ముంబయి ఉగ్రవాద దాడుల నిందితుడు హఫీజ్ మొహమ్మద్ సయీద్‌ను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ పాకిస్థాన్ సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుల్లో ఒకడైన సయీద్ నిషేధిత జాముదుత్ దవా తీవ్రవాద సంస్థ అధినేతగా వ్యవహరిస్తున్నాడు.
అతడిని పాకిస్థాన్ ప్రభుత్వం ముంబయి దాడులకు సంబంధించి గృహనిర్బంధంలో ఉంచింది. అయితే తన గృహ నిర్బంధం అక్రమమంటూ సయీద్ లాహోర్ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వం సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో జూన్ 02న సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
లాహోర్ హైకోర్టు తీర్పుపై భారత్‌తోపాటు, పలు ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవడంతో పాకిస్థాన్ ప్రభుత్వం సయీద్ విడుదల తీర్పును సవాలు చేయాలని నిర్ణయించుకుంది. శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో సయీద్ విడుదలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.