పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రావీన్స్‌లో వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 16 మంది మృతి చెందారు. ఈ దాడుల్లో మరో 150 మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. తమపై దాడులు కొనసాగిస్తే, మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తామని తాలిబాన్లు ముందురోజు హెచ్చరించడం, ఈ హెచ్చరిక చేసిన కొన్ని గంటల్లోనే రెండు ఆత్మాహుతి దాడులు జరగడంతో ఈ ప్రాంత పౌరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే ఇదే ప్రాంతంలో శనివారం మరో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పాక్ భూభాగం పూర్తిగా పర్వతాలతో నిండివుంది. ఈ ప్రాంతంలో చట్టబద్ధమైన పాలన ఉండదు. అక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి అతికొద్ది పట్టు మాత్రమే ఉంది. ఇక్కడి భౌగోళిక సామాజిక పరిస్థితులను ఆసరగా చేసుకొని తీవ్రవాద గ్రూపులు ఆఫ్ఘనిస్థాన్‌లోని నాటో, అమెరికా దళాలు, అదే విధంగా పాకిస్థాన్ భద్రతా దళాలు, ఇతర అధికారులను లక్ష్యంగా చే్సుకొని దాడులకు పాల్పడుతున్నాయి.