పాకిస్థాన్‌లో అమెరికా మానవరహిత యుద్ధ విమానం (డ్రోన్) జరిపిన దాడిలో ఐదుగురు తీవ్రవాదులు మృతి చెందారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక దక్షిణ వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో అమెరికా డ్రోన్‌లు క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఆర్మీ కూడా ఈ ప్రాంతంలో తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతోంది. పాకిస్థాన్ తాలిబాన్ కమాండర్ వాలీ అలియాస్ మలాంగ్ నజీర్ స్థావరంతోపాటు, రెండు వేర్వేరు ప్రదేశాల్లో అమెరికా డ్రోన్ దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో తీవ్రవాద దాడులు జరుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాలిబాన్ నేత ముల్లా నజీర్‌కు ఆధిపత్యంలోని ప్రాంతాలపై అమెరికా డ్రోన్ దాడులు చేసిందని చెప్పారు. షా అలంలోని మదర్సా, షా ఆలం నివాసంపై అమెరికా డ్రోన్ మూడు క్షిపణులు ప్రయోగించింది. దాడి జరిగిన ప్రాంతం దక్షిణ వజీరిస్థాన్ ఏజెన్సీలో ప్రధాన పట్టణమైన వానాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.