భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్ తోయిబా, అల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలతో పాకిస్థాన్ సన్నిహిత సంబంధాలు కలిగివున్నప్పటికీ.. తమకు పాక్‌తో ఉన్న దోస్తీని తెగతెంపులు చేసుకోలేమని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై తాము సాగిస్తున్న పోరులో భాగంగా ఈ ప్రాంతంలో అల్‌ఖైదాతో పోరుకు పాకిస్థాన్‌తో మైత్రి మినహా తమకు ప్రత్యామ్నాయం లేదని ఆ దేశ రక్షణ శాఖామంత్రి లియెన్ పనెట్టా అభిప్రాయపడ్డారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలు అమెరికాకు ఆందోళనకరంగానే ఉన్నాయన్నారు. ఇటువంటి అంశాలు పాకిస్థాన్‌తో మైత్రిని సంక్లిష్టం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌కు లష్కరే తోయిబాతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌లో తమ దళాలనెదిరిస్తున్న హక్కానీ తదితర గ్రూపులతో కూడా సన్నిహిత సంబంధాలున్న విషయం తమకు తెలుసన్నారు.
అలాగే ముంబై దాడులకు సూత్రధారి అయిన లష్కర్‌తో సహా మరికొన్ని సంస్థలను పాక్ గట్టిగా సమర్థిస్తోందన్నారు. ఈ విషయంపై భారత్ దీర్ఘకాలంగా అంతర్జాతీయ సమాజానికి మొర పెట్టుకుంటున్నప్పటికీ.. తమకు, పాక్‌తో ఉన్న దోస్తీని మాత్రం తెగతెంపులు చేసుకోలేమని ఆయన చెప్పారు.