నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ మంత్రివర్గం శుక్రవారం ఆ దేశ ఆర్మీ చీఫ్ కతావల్‌ను తొలగిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను రద్దు చేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ రూక్మాంగుడ్ కతావల్‌ను తొలగించేందుకు నేపాల్‌లో ఇంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ప్రచండ నేతృత్వంలోని మావోయిస్టు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేపాల్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. కతావల్ తొలగింపు నిర్ణయాన్ని ఆ వెంటనే నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ అడ్డుకున్నారు. అనంతర పరిణామాలు నేపాల్ తొలి మావోయిస్టు ప్రభుత్వం కూలిపోవడానికి దారి తీశాయి.
ఆపై మాధవ్ కుమార్ నేపాల్ నేతృత్వంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన సంగతి తెలిసిందే. తాజాగా మాధవ్ కుమార్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ తొలగింపు కోసం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా ఆర్మీ చీఫ్ తొలగింపును అధ్యక్షుడు అడ్డుకోవడాన్ని ఖండించాలని ప్రచండ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా రద్దు చేశామని నేపాల్ సమాచార శాఖ మంత్రి శంకర్ పఖరేల్ తెలిపారు.