వివాదస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ తన నేపాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఖాట్మండూలో ప్రతికూల వాతావరణాన్ని కలిగించే అవకాశం ఉండటంతో నేపాల్ తొలి సాహిత్య సదస్సులో పాల్గొనాల్సిన నస్రీన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.
" నేను విచారిస్తున్నాను, నేపాల్‌లో ఎలాంటి విచారకరమైన సంఘటన చోటుచేసుకోకుండా నా పర్యటనను రద్దు చేసుకొన్నాను" అని 1994 నుంచి ప్రవాస జీవితాన్ని గడుపుతున్న నస్రీన్ సోమవారం తన ట్విట్టర్ బ్లాగ్‌లో రాసుకొన్నారు.
ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న 48 ఏళ్ల నస్రీన్ శనివారం ఖాడ్మండూలో జరిగే నేపాల్ తొలి సాహిత్య సదస్సులో పాల్గొనవలసి ఉన్నప్పటికీ ఆమె తన స్వీడిష్ పాస్‌పోర్ట్‌ను మరచిపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అందుకోలేకపోయారు. ఈ సందర్భంగా నేపాల్‌ను విదేశంగా చూడటం లేదని ఆమె ట్విట్టర్‌లో రాసుకొన్నారు. ఈ వ్యాఖ్యలు అనేక మంది నేపాల్ బ్లాగర్స్‌ని బాధపెట్టాయి.
నేపాల్‌ను భారత్‌లో భాగంగా భావిస్తున్న ఆమె ప్రపంచ భౌగోలిక పరిజ్ఞాన లేమిపై కోపం వ్యక్తం చేశారు. ఖాడ్మండూలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలతో సాహిత్య సదస్సు నిర్వహకులు ఖాడ్మండూలో ఆమె భద్రతకు భరోసా ఇవ్వకపోవడంతో నస్రీన్ తన నేపాల్ పర్యటనను రద్దు చేసుకొన్నారు.