లిబియా అధికార టెలివిజన్ అల్-జమాహిరియా సోమవారం నిలిచిపోయినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ ప్రసారమాధ్యమాన్ని లిబియా తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నట్లు అనధికారికంగా వార్తలు వెలువడ్డాయి.
రాత్రి 7.30 గంటల సమయంలో అల్-జమాహిరియా ప్రసారాన్ని ఆపేయడంతో టెలివిజన్ స్క్రీన్స్ హఠాత్తుగా నల్లగా మారిపోయాయి. కొన్ని నిమిషాల తర్వాత స్క్రీన్ కుడివైపు అడుగుభాగాన నెట్‌వర్క్ లోగో మాత్రమే కనిపించింది. ఎలాంటి బొమ్మ లేదా శబ్దం గాని ప్రసారం కాలేదు.
రాజధాని ట్రిపోలిలో అధిక భాగాన్ని అదుపులోకి తెచ్చుకొన్న తిరుగుబాటుదారులు అధికార టెలివిజన్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు లిబియా ప్రతిపక్ష వెబ్‌సైట్స్ వెల్లడించాయి. అయితే ఈ వార్తలకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ జరగలేదు. ట్రిపోలీలో ఎక్కువ భాగం తమ ఆధీనంలోకి తెచ్చుకొన్న రెబెల్స్ అధ్యక్షుడు గడాఫీ కుమారుడు సైఫ్‌ను బంధించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.