ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాంకీ మూన్ మయన్మార్లో సైనికాధికారులచే జైలులో బందీగానున్న ప్రతిపక్షనాయకురాలు ఆంగ్ సాన్ సూకీని కలిసేందుకు అను మతి లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.
బాన్ మయన్మార్లో మరోమారు జనరల్ థాన్ శ్వేను కలిసారు. అయినాకూడా ఆయనకు అనుమతి లభించలేదు. తన యాత్రలో భాగంగా ఆమెను కలిసేందుకు కార్యక్రమం రూపొందించుకుని ఉన్నారు.
దీంతో ఆయన నిరాశ చెంది విలేకరులతో మాట్లాడుతూ... నేను నా శాయశక్తులా కృషి చేశాను కాని ఆమెను కలిసి మాట్లాడేందుకు తనకు అనుమతి లభించలేదని వాపోయారు.
జుంటా రాజధాని నెపియాదౌలో దాదాపు 30నిమిషాలపాటు సమావేశమై అనుమతినివ్వాలని ఆయన జనరల్ థాన్ శ్వేను కోరారు. కాని అనుమతి లభించకపోవటంతో ఆయన నిరాశతో యంగూన్ వెళ్ళారు.
ఈ సందర్భంగా ఆ అధికారి తనతో చెప్పిన మాటలను ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ... జుంటా అధికారి తనకు సహకరించేందుకు అనుమతినిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాకూడా సూకీపై కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆమెపై చట్టపరమైన ఒత్తిళ్ళున్న కారణంగా తాను ఆమెతో కలిసేందుకు అనుమతిని ఇవ్వలేనని ఆయన చెప్పారని మూన్ తెలిపారు.
ఈ సంఘటనతో తాను మనోవ్యధకు గురయ్యానని ఆ అధికారి అరుదైన అవకాశాన్ని పోగొట్టుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తకం చేశారు. సూకీని గత ఇరవై సంవత్సరాలలో దాదాపు 14సంవత్సరాలవరకు న్యాయపరమైన ఒత్తిళ్ళతో ఆమెను నిర్భంధించియున్నారు.
ప్రస్తుతం ఆమెను కలిసేందుకుకూడా ఎవరిని అనుమతించడంలేదు. ఈ నేపథ్యంలోనే బాంకీమూన్ను అనుమతించలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఆమె న్యాయవిచారణలో దోషిగా తేలితే ఆమెకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అమలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.