న్యూజిలాండ్ దక్షిణ ప్రాంతంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదయినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. న్యూజిలాండ్ నైరుతీ అంచున భారీ భూకంపం సంభవించింది.
ఇన్వెర్‌కార్గిల్‌కు పశ్చిమంగా 161 కిలోమీటర్ల దూరంలో 33 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపానికి సంబంధించిన ఇతర వివరాలేవీ తెలియరాలేదు. భూకంపం కారణంగా ఫసిఫిక్ మహాసముద్రంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు.
ఇదిలా ఉంటే గత నెలలో న్యూజిలాండ్ ఉత్తర ద్వీపం మధ్య భాగంలో 13 గంటల వ్యవధిలో వరుసగా ఎనిమిది భూకంపాలు సంభవించాయి. న్యూజిలాండ్‌లో ప్రతిఏటా సాధారణంగా 10 వేల నుంచి 15 వేల వరకు భూకంపాలు సంభవిస్తుంటాయి. న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద భూకంపం 1855లో సంభవించింది. వైరారపాలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 8.2గా నమోదయింది.