పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి తీవ్రవాదం కోరలు చాస్తూనేవుందని, దీనికి అడ్డకట్ట వేసేందుకు అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్ కోరారు. అదే విధంగా తాలిబాన్లతో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
బస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో తీవ్రవాదంపై జరుగుతున్న యుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మిలిబాండ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో పాకిస్థాన్ తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందుకు అంతర్జాతీయ సమాజం అండగా నిలవాలన్నారు.
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో ఉన్న పెషావర్, క్వెట్టా నగరాలు ఆఫ్ఘనిస్థాన్‌లోకి తాలిబాన్ తీవ్రవాదులను ఎగుమతి చేస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ దేశాల ప్రభుత్వాలు కుదుర్చుకునే శాంతి ఒప్పందాలు ఏవైనా తీవ్రవాదాన్ని విడిచిపెట్టినవారితోనే ఉండాలన్నారు.
అల్ ఖైదాను మట్టుపెట్టేందుకు, ఆఫ్ఘనిస్థాన్‌లో దళాలు, పౌరులపై దాడులకు దూరంగా ఉన్న మాజీ తీవ్రవాదులతోనే శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. రాజకీయ ప్రక్రియలో భాగస్వాములు కావాలనుకుంటున్న తాలిబాన్ తీవ్రవాదులతో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు కర్జాయ్ చర్చలు జరపాలని కోరారు.