తీవ్రవాదంపై పోరులో అమెరికా, పాకిస్థాన్‌ల మధ్య స్పష్టత ఉన్నట్లయితే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి మార్క్ గ్రాస్‌మాన్‌తో సోమవారం సమావేశం సందర్భంగా జర్దారీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, తీవ్రవాదంపై పోరాటం, ప్రత్యేకించి ఆఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులను ఈ సమావేశంలో చర్చించినట్లు అధ్యక్షుడి ప్రతినిధి ఫర్హతుల్లాహ్ బాబర్ తెలిపారు. తీవ్రవాదంపై యుద్ధంలో ఎంతో త్యాగం చేసిన పాకిస్థాన్ ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తుందని బాబర్ చెప్పారు.
మే 2న అబోట్టాబాద్ పట్టణంలో అల్‌ఖైదా ఛీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన తర్వాత ఇస్లామాబాద్, వాషింగ్టన్ మధ్య సంబంధాలు కొంత మేర దెబ్బతిన్నాయి. పాకిస్థాన్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా అమెరికా కమాండోలు దాడి చేసి లాడెన్‌ను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.