పాకిస్థాన్ యుద్ధ విమానాలు సోమవారం తాలిబాన్ తీవ్రవాదులకు గట్టిపట్టు ఉన్న ప్రాంతాలపై దాడులు చేశాయి. సమస్యాత్మక దక్షిణ వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో తాలిబాన్ తీవ్రవాదుల ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో వారితో పోరాడుతున్న పాకిస్థాన్ సైన్యం తాజాగా వైమానిక దాడులు జరిపింది.
ఇదిలా ఉంటే వాయువ్య ప్రావీన్స్‌లోని స్వాత్ లోయలో పాకిస్థాన్ సైనికులు, తాలిబాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 14 మంది తీవ్రవాదులు మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు దక్షిణ వజీరిస్థాన్‌లోని లఢా ప్రాంతంలో పాకిస్థాన్ యుద్ధ విమానాలు తాలిబాన్ స్థావరాలపై దాడులు చేశాయి.
ఈ ప్రాంతంపై తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్‌కు గట్టిపట్టు ఉంది. వైమానిక దాడుల్లో ప్రాణనష్టం జరిగినట్లు సమాచారమేదీ లేదు. మెహసూద్‌ను పట్టుకునేందుకు, అతని నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు తుది పోరుకు రంగం సిద్ధం చేస్తున్నామని పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది.
స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులతో జరుగుతున్న పోరు చివరి దశలో ఉందని అధికారులు తెలిపారు. తాజాగా తిలిగ్రామ్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 14 మంది తీవ్రవాదులు మృతి చెందారు. అనంతరం భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.