ఐక్యరాజ్యసమితి అణు నియంత్రణ సంస్థ కొత్త డైరెక్టర్ జనరల్ ఎన్నికల జూన్ 9న జరగనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్‌గా ప్రస్తుతం మొహమెద్ ఎల్‌బరాదీ కొనసాగుతున్నాయి. మార్చిలో జరిగిన సెషన్లో ఎల్‌బరాదీ వారసుడిని ఎన్నుకునేందుకు సభ్యులు విఫలయత్నం చేశారు.
ఎల్‌బరాదీ ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ బాధ్యతల నుంచి ఈ ఏడాది నవంబరులో తప్పుకోనున్నారు. ప్రస్తుతం ఈ పదవి కోసం ఐదుగురు వ్యక్తులు బరిలో ఉన్నారు. 35 దేశాల ఐఏఈఏ బోర్డు జూన్ 9 కొత్త డైరెక్టర్ జనరల్ కోసం అనధికారిక ఓటింగ్ నిర్వహించనుంది.
మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు తక్కువ అవకాశం కలిగిన వ్యక్తులను బరి నుంచి తొలగించేందుకు ఈ ఓటింగ్ నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే జూన్ 9న ఓటింగ్ జరుగుతుందనే విషయాన్ని ఐఏఈఏ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు.