పశ్చిమ చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంత రాజధానిలో జరిగిన హింసాత్మక అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 140కి పెరిగింది. ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ అల్లర్లలో మరో 800 మంది గాయపడ్డారు. జిన్‌జియాంగ్ రాజధాని ఉరుంఖీలో ఆందోళనకారులు ఆదివారం వీధుల్లోకి వచ్చి విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు.
ఓ ముస్లిం వర్గానికి చెందిన ఆందోళనకారులు ఇతర పౌరులు, భద్రతా దళాలపై దాడులు చేశారు. దీనికి సంబంధించి జరిగిన ఘర్షణల్లో 140 మంది మృతి చెందారని చైనా పాక్షిక అధికార వార్తా సంస్థ ఒకటి వెల్లడించింది. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.
గత నెలలో దక్షిణ చైనాలోని ఓ కర్మాగారంలో రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ కర్మాగారంలో హాన్ చైనీస్, ఉయ్‌ఘుర్ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ ఉయ్‌ఘుర్ వర్గానికి చెందిన ఆందోళనకారులు ఆదివారం ఉరుంఖీ వీధుల్లోకి విధ్వంసానికి పాల్పడ్డారు.