చైనా రాజధాని బీజింగ్‌కు మంగళవారం రాత్రి చేరుకొన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ బుధవారం చైనా విదేశాంగ మంత్రి యాంగ్ జీఛీతో ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.
రక్షణ, ఆర్ధిక, వాణిజ్య రంగాల్లో పాకిస్థాన్, చైనాలు దృడమైన బంధాన్ని కలిగివున్నాయని తన పర్యటన సందర్భంగా 34 ఏళ్ల ఖర్ పేర్కొన్నారు. తాము చైనాతో వ్యూహాత్మక సంబంధాలను కలిగివున్నట్లు ఆమె చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇతర దేశాలతో సంబంధాలకు ఆటంకం కాదని ఈ పాకిస్థాన్ తొలి మహిళా విదేశాంగమంత్రి పేర్కొన్నారు.
పాకిస్థాన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొన్న దేశాల్లో చైనా కూడా ఒకటి. రానున్న వారాల్లో జింజియాంగ్‌లో జరిగే వాణిజ్య సదస్సులో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పాల్గొనడానికి ముందు రబ్బానీ ఖర్ చైనాలో పర్యటిస్తున్నారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా నియమించబడిన తర్వాత హీనా రబ్బానీ ఖర్ తొలుత భారత్‌లో పర్యటించారు.