పాకిస్థాన్ సైన్యం బహిరంగంగా, రహస్యంగా రెండు విధాలుగా కాశ్మీర్‌లో తరచూ జోక్యం చేసుకొంటున్నదని పర్యవసానంగా ప్రమాదకరమైన ఫలితాలు వస్తున్నాయని న్యూయార్క్‌కు చెందిన ఓ విశ్లేషకుడు వెల్లడించారు.
1947 ఆగస్ట్‌లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. జమ్ము, కాశ్మీర్ మహారాజు హరి సింగ్ స్వతంత్ర్యంగా ఉండటానికి వీలుకాకపోవడంతో తన సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిర్ణయించారు. పాకిస్థాన్ ఆరంభ రాజకీయ నాయకత్వం ఈ నిర్ణయాన్ని బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నించింది అని న్యూయార్క్‌లోని స్వతంత్ర విశ్లేషకుడు హమీద్ హుస్సేన్ అల్ జజీరా ఛానెల్‌కు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
స్థానిక కాశ్మీర్ ప్రజలను పూర్తిగా విస్మరించిన పాకిస్థాన్ సైన్యం గడచిన 60 సంవత్సరాలుగా పదే పదే అదే తప్పును చేస్తున్నది. 1965లో పాకిస్థాన్ రెండో భారీ తప్పిదానికి పాల్పడింది, కాశ్మీర్‌లోకి బలగాలను పంపి ఆక్రమించుకోవాలని చూసిందని హుస్సేన్ పేర్కొన్నారు.
1999లో మరోసారి పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ నాయకత్వంలో కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాకిస్థాన్ పాల్పడిందని ఆయన తెలిపారు. పాకిస్థాన్ సైన్యం తన వైఖరిని మార్చుకొని స్థానిక ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇచ్చినప్పుడే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.