ముంబయి ఉగ్రవాద దాడుల సందర్భంగా భారత భద్రతా దళాలకు పట్టుబడిన ఒకేఒక్క తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ తాజాగా కోర్టులో చేసిన నేరాంగీకార ప్రకటన ఏకపక్షంగా ఉందని పాకిస్థాన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. అజ్మల్ కసబ్ తాను ముంబయి దాడుల్లో పాల్గొన్నానని, వీటిలో తన పాత్ర ఉందని అంగీకరించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా పాల్గొన్న ఇతరుల పేర్లను కూడా వెల్లడించాడు. ఈ ప్రకటనపై పాకిస్థాన్ మాట్లాడుతూ.. కసబ్ నేరాంగీకారం ఏకపక్షంగా ఉందని, ఒత్తిడిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన వాగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని తాము ఎటువంటి చర్యలు తీసుకోలేమని తెలిపింది.
ముంబయిలోని ఆర్థూర్ రోడ్డు జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో కసబ్ సోమవారం ముంబయిలో దాడుల్లో తన పాత్రను అంగీకరించాడు. కసబ్ ప్రకటనపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి చౌదరి ఎ ముఖ్తార్ మాట్లాడుతూ.. ఇది ఏకపక్షంగా ఉందన్నారు. అతని ప్రకటనలో వాస్తమెంతుందో తనకు తెలియదని ఓ భారత వార్తా ఛానల్‌తో చెప్పారు.