అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ (ఏఎఫ్) విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫ్రాన్స్, బ్రెజిల్ వైమానిక దళాల సిబ్బంది కూలిపోయిన విమానం ఆచూకీ కనుగొనే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాయి. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ బయలుదేరిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం టేకాఫ్ తీసుకున్న నాలుగు గంటల తరువాత సముద్రంలో కూలిపోయింది.
ఈ ప్రమాదంలో విమానంలో 228 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది. తుపాను, పిడుగుపాటు, విద్యుత్ సర్క్యూట్‌లో లోపాల కారణంగా ఈ విమానం కూలిపోయిందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. విద్యుత్ లోపాలకు సంబంధించి చివరిసారి ఈ విమానం నుంచి సంకేతాలు అందాయి. అనంతరం ఈ విమానం రాడార్ తెరపై నుంచి అదృశ్యమైంది.
విమాన శకలాలను కొనుగొనేందుకు సోమవారం ప్రారంభమైన గాలింపు చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బ్రెజిల్, పశ్చిమ ఆఫ్రికా తీరాల మధ్యలో అట్లాంటిక్ మహాసముద్రంపై విమానం కోసం మిలటరీ విమానాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. విమాన శకలాలను కనుగొనేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అమెరికా ఉపగ్రహ సాయం కోరింది.
విమానం అదృశ్యమైన ప్రదేశానికి బుధవారానికి తొలి నౌక చేరుకునే అవకాశం ఉంది. ప్రమాదంలో విమానంలోని వారందరూ ప్రాణాలు కోల్పోతే.. ప్రపంచ చరిత్రలో ఇది ఘోర విమాన ప్రమాదంగా నిలిచిపోనుంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు ఇప్పటికీ తెలియరాలేదన్నారు. కొందరు నిపుణులు పిడుగుపాటుకు విమానం కూలిందనే ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడే వారు ఉండేందుకు చాలా తక్కువ అవకాశం ఉందని సర్కోజీ తెలిపారు.