వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలపై ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నిరసనకారులు బుధవారం ఇరాన్ పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులతో ఘర్షణలకు దిగారు. జూన్ 12న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రిగ్గింగ్ చేసి గెలిచారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
ప్రధాన ప్రత్యర్థి మీర్ హుస్సేన్ మౌసావి నేతృత్వంలోని ఇరాన్‌లో గత కొన్ని రోజులుగా పెద్దఎత్తున ఆందోళన జరుగుతోంది. ఈ ఆందోళనలు బుధవారం కూడా కొనసాగాయి. ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అధ్యక్ష ఎన్నికలను రద్దు చేసే అవకాశాన్ని తోసిపుచ్చారు. ఎన్నికల ఫలితాలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు.
అహ్మదీనెజాద్ తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నిక కావడాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు సెంట్రల్ టెహ్రాన్‌లో ఆందోళనకు దిగారు. వీరిని నియంత్రించేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అంతేకాకుండా వారిపై లాఠీఛార్జి కూడా చేశారు. కొందరు నిరసనకారులు పోలీసులపై తిరగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు ఓ వార్తా సంస్థతో చెప్పారు.