పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ వచ్చే నెలలో ఈజిప్టులో జరిగే ఎన్ఏఎం సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఇటీవల రష్యా పర్యటనలో భారత ప్రధాని మన్మోమన్ సింగ్‌తో భేటి అయిన జర్దారీ ఎన్ఎంఏ సదస్సులోనూ ఆయనను మరోసారి కలుసుకోవాల్సి ఉంది.
అయితే రష్యా పర్యటనలో మన్మోహన్ సింగ్ పాకిస్థాన్‌ను ఉద్దేశించి బహిరంగంగా చేసిన కఠిన వ్యాఖ్యలు ఆ దేశ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ హాజరుకానున్న ఎన్ఏఎం సమావేశానికి జర్దారీ దూరం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా జర్దారీని కలుసుకున్న మన్మోహన్ సింగ్ భారత్‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలపై ఆ దేశ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, తాలిబాన్లపై సైనిక చర్య చేపట్టిన విధంగానే మిగిలిన తీవ్రవాద సంస్థల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశంపై దాడులు చేసేందుకు పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలపై విశ్వసనీయ చర్యలు తీసుకున్న తరువాతే ఇరుదేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మన్మోహన్ సింగ్ నిర్మొహమాటంగా బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేయడం పాకిస్థాన్ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈజిప్టులో జులై 15న జరిగే ఎన్ఏఎం సదస్సులో పాకిస్థాన్ బృందానికి ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ నేతృత్వం వహిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.