సరిహద్దు ఉమ్మడి నిఘాపై భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. సమగ్ర సరిహద్దు నిర్వహణ, మనుషుల అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధాల స్మగ్లింగ్ వంటివి సరిహద్దుల మీదుగా జరగకుండా నిరోధించేందుకు సంయుక్త నిఘా చర్యలు చేపట్టడం ద్వారా సరిహద్దుల వెంబడి భద్రతను పటిష్టం చేయడం ఈ ఒప్పందంలోని కీలకాంశం.
ఈ ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల హోంమంత్రులు పి.చిదంబరం, సహరా ఖాటున్‌ల సమక్షంలో బంగ్లా బోర్డర్ గార్డ్స్ డెరైక్టర్ జనరల్ మేజర్ జనరల్ అన్వర్ హుస్సేన్, భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధిపతి రామన్ శ్రీవాత్సవలు సంతకాలు చేశారు.
దీనిపై మంత్రి చిదంబరం మాట్లాడుతూ సీమాంతర నేరాలను అరికట్టడంతో పాటు అన్ని సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే, తీవ్రవాదంపై భారత్ తీసుకునే చర్యలకు బంగ్లాదేశ్ తన వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వచ్చే సెప్టెంబరు ప్రధాని మన్మోహన్‌సింగ్ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారని, ఈలోపు సరిహద్దులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించుకోగలమన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీమాంతర భద్రత అంశం రెండు దేశాల సమస్యగా చిదంబరం అభివర్ణించారు.