మయన్మార్‌కు ఓ ఉత్తర కొరియా నౌక ఆయుధాలు తీసుకొని వెళుతున్నట్లు దక్షిణ కొరియా నిఘా వ్యవస్థ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర కొరియాకు చెందిన ఓ నౌక మయన్మార్‌వైపుకు తేలికరకం ఆయుధాలతో వెళుతున్నట్లు గత కొన్ని రోజులుగా వివిధ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ విషయాన్ని దక్షిణ కొరియా అధికారిక యంత్రాంగం సైతం ధృవీకరించింది. ఉత్తర కొరియా ఇతర దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేయడాన్ని ఐక్యరాజ్యసమితి ఇటీవల చేసిన ఓ కొత్త తీర్మానంలో నిషేధించింది. అయితే ఆయుధాలతో వెళుతున్న ఉత్తర కొరియా నౌకను సముద్రంలో అడ్డుకునేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నించకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇటువంటి చర్యలు ఎవైనా తాము యుద్ధంగా పరిగణిస్తామని ఉత్తర కొరియా తేల్చిచెప్పడమే ఇందుకు కారణం. మయన్మార్‌వైపుకు వెళుతున్న కాంగ్ నామ్ అనే ఉత్తర కొరియా నౌకలో ఆయుధాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నెలలో ఉత్తర కొరియా అణు పరీక్ష నిర్వహించిన అనంతరం ఐక్యరాజ్యసమితి ఆ దేశంపై కొత్త ఆంక్షల విధించింది.
ఈ కొత్త ఆంక్షల కింద అంతర్జాతీయ దృష్టి ప్రస్తుతం కింగ్ నామ్‌పై పడింది. ఉత్తర కొరియా నుంచి బుధవారం బయలుదేరిన ఈ నౌకపై అమెరికా మిలిటరీ నిఘా పెట్టింది. తాజాగా దక్షిణ కొరియా నిఘా అధికారులు ఈ నౌకలో తేలికరకం ఆయుధాలు ఉన్నాయని, ఇది మయన్మార్‌లోని యాంగోన్ నగరానికి వెళుతున్నట్లు పేర్కొన్నారు.