ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న ఉగ్రవాదాన్ని ఏరూపంలోనైనా రూపుమాపాలని నామ్ సభ్యదేశాలు ముక్తకంఠంతో ఘోషించాయి. ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రస్తావించిన అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ముసాయిదాను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేయాలని నామ్ శిఖరాగ్ర సదస్సు డిమాండ్ చేసింది.
ఉగ్రవాదం ఒక మతం, ఒక జాతి, ఒక నాగరికత లేదా ప్రత్యేక జాతికి సంబంధించినది కాదని నామ్ దేశాలు పేర్కొన్నాయి. ఐక్యరాజ్యసమితి ఛార్టర్, అంతర్జాతీయ చట్టం, సంబంధిత అంతర్జాతీయ సదస్సుల్లో పేర్కొన్న విధంగా ఎక్కడ, ఎవరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినా, ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదంపై పోరాడేందుకు నామ్ సంఘీభావం ప్రకటించింది.
ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం తీరును, సంయుక్త నిర్వహణ వంటి అంశాలపై నామ్ సభ్య దేశాల అభిప్రాయాలను తెలుసుకోవడం వంటి చర్యలు అవసరమని డిక్లరేషన్ పేర్కొంది. ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మన్మోహన్ సింగ్.. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు నిర్వహించి, కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కివక్కాణించారు. ఏదేశం కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించరాదని, ప్రస్తుతం ఉన్న తీవ్రవాద స్థావరాలను తక్షణం ధ్వంసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఈ నామ్ సదస్సులో పలు అంశాలపై ఓ డిక్లరేషన్ చేశారు.
ఇందులో ఉగ్రవాదంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, మాంద్యం, ఆహార భద్రత, పర్యావరణ మార్పులు, భద్రతా మండలి విస్తరణ, నిరాయుధీకరణ, అంతర్జాతీయ సమాజ భద్రత, స్వయం నిర్ణయాధికారం, స్వైన్ ఫ్లూతో సహా ప్రబలుతున్న అంటువ్యాధులు తదితర అంశాలు చోటుచేసుకున్నాయి.