ఇరాన్ మిలిటరీ సోమవారం షాహబ్- 3 క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తన చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయేల్ను ఢీకొట్టగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉన్నాయి. ఇరాన్ మిలిటరీ గత కొన్ని గంటల్లో నిర్వహించిన రెండో క్షిపణి పరీక్ష ఇది.
ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమంపై పశ్చిమ దేశాలు, ఐక్యరాజ్యసమితి అణు శక్తి సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమ దేశంలో రెండు యురేనియం శుద్ధి ప్లాంటు నిర్మిస్తున్నట్లు ఇరాన్ ఇటీవల బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా సహా, ఇతర పశ్చిమ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ఆదివారం స్వల్పదూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.
ఇది జరిగిన కొన్ని గంటలకే ఇప్పుడు షాహబ్- 3 క్షిపణి పరీక్ష నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ క్షిపణి 1300- 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. దాదాపుగా అన్ని అరబ్ దేశాలు, కొన్ని యూరప్ ప్రాంతాలు, టర్కీలోని చాలా భాగం ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి.