అణు కేంద్రాల తనిఖీ నిమిత్తం ఇరాన్ ప్రతినిధులతో ఐక్యరాజ్య సమితి అటామిక్ చీఫ్ ఆదివారం సమావేశమై చర్చలు జరుపనున్నట్టు ఇరాన్ సీనియర్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆరు అగ్రరాజ్యాలు కలిసి ఆ దేశంతో చర్చలు జరిపిన విషయం తెల్సిందే. ఈ చర్చలు ఫలించి, అణు కేంద్రాల తనిఖీకి ఇరాన్ అంగీకరించింది.
ఇందులోభాగంగా పుణ్య నగరంగా ప్రసిద్ధిగాంచిన ఖోమ్ పట్టణంలో ఉన్న రెండు అణు కేంద్రాలను సమితి వాచ్‌డాగ్ ప్రతినిధులు తనిఖీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఛైర్మన్ అల్‌బెరాడీ ఇరాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే, ఆయన ఖోమ్ నగరంలోని అణు విద్యుత్ కేంద్రాల తనఖీ చేపట్టబోరని ఇరాన్ న్యూస్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.
అయితే, ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ హెడ్ అలీ అక్బర్ సలేహీతో పాటు.. ఇతర ఇరాన్ ఉన్నతాధికారులతో అల్‌బెరాడీ సమావేశం అవుతారని సమాచార వర్గాలు పేర్కొంటున్నాయి.