అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని ఆ దేస విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. తమను శత్రువులుగా పరిగణిస్తున్న దేశాలతో చర్చలు జరిపేందుకు అమెరికా ఇప్పుడు కూడా సిద్ధంగా ఉందన్నారు. అయితే దీనిని బలహీనతగా పరిగణించరాదని హిల్లరీ క్లింటన్ హెచ్చరించారు.
చర్చలకు తాము సముఖత వ్యక్తం చేయడం బలహీనత కాదని క్లింటన్ వాషింగ్టన్‌లో విదేశాంగ వ్యవహారాల మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో తమ దేశం అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రయోజనాలకు కాపాడుకునేందుకు సున్నితంగా వ్యవహరిస్తుందని, ఇదే మార్గంలోనే మిత్రదేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలతో భాగస్వామ్యాలను పటిష్ట పరుచుకునేందుకు కృషి చేస్తుందని హిల్లరీ తెలిపారు. ఇరాన్‌తో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు అమెరికా ఇప్పటికీ ఇష్టత చూపుతోందన్నారు.