ఆస్ట్రేలియాలో గడిచిన వారం రోజుల్లో నలుగురు పౌరులు స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడి మరణించారు. తాజాగా 71 ఏళ్ల మహిళ ఒకరు స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా అనారోగ్యంతో మృతి చెందారు. దేశంలో ఇది నాలుగో స్వైన్ ఫ్లూ మరణమని ఆస్ట్రేలియా అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో తాజా మరణంతో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఫిలిఫ్పీన్స్‌లో సోమవారం స్వైన్ ఫ్లూ వ్యాధి సోకి ఒకరు మృతి చెందారు. తాజాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఓ మహిళ ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
విక్టోరియాలో ఇది మూడో స్వైన్ ఫ్లూ మరణం. విక్టోరియా రాష్ట్రంలో మొత్తం 1509 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇదే. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు మొత్తం 3,280 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.