ఆసియా ఖండంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం ఫిలిప్పీన్స్‌లో నమోదయింది. స్వైన్ ఫ్లూ సోకిన 49 ఏళ్ల ఫిలిప్పీన్స్ పౌరురాలు ఒకరు హృదయ, కాలేయ సంబంధ సమస్యలతో మరణించారు. ఆసియాలో స్వైన్ ఫ్లూ కారణంగా తొలి మరణం ఇదేనని మనీనాలో ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఏ(హెచ్1ఎన్1) వైరస్ సోకిన రెండో రోజుల తరువాత జూన్ 19న ఈ మహిళ మరణించారని ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ కార్యదర్శి డఖే వెల్లడించారు. వైరస్, బ్యాక్టీరియా లేదా రెండింటి కారణంగా తీవ్రమైన నిమోనియాతో బాధపడుతున్న ఈ మహిళ గుండెపోటు రావడంతో మరణించారని చెప్పారు.
దక్షిణాసియా ప్రాంతంలో స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా ఫిలిప్పీన్స్‌లోనే నమోదయ్యాయి. ఫిలిప్పీన్స్‌లో అత్యధికంగా 445 కేసులు నమోదయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వీరిలో 80 శాతం మందికి ఈ వ్యాధి నయమైంది. ఫిలిప్పీన్స్‌లో తొలి స్వైన్ ఫ్లూ కేసు మే 21న నమోదయింది.