ఇటలీలో గురువారం ప్రారంభం కాబోతున్న జి8 సమావేశాల్లో భాగంగా పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై అంతర్జాతీయ సదస్సుకు భారత్ పిలుపునిచ్చింది. ఇటలీలోని ట్రియస్టేలో మూడు రోజులపాటు జి8 పారిశ్రామిక దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు జరుగుతాయి. ఇందులో భారత్‌తోపాటు, ప్రధాన పారిశ్రామిక దేశాలు పాల్గొంటాయి.
ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ పరిస్థితులపై చర్చలు జరపాలని భారత్‌తోపాటు వివిధ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ చర్చలకు ఇరాన్‌ను కూడా ఆహ్వానించాయి. అయితే దీనిపై ఇరాన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లలో అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లపై ఈ సదస్సులో భాగంగా ప్రపంచదేశాలు చర్చలు జరపాలనుకుంటున్నాయి.
ఈ చర్చల ద్వారా పాకిస్థాన్ నుంచి భారత్ ఏం కోరుకుంటుందనే దానిపై స్పందించేందుకు పైవివరాలు వెల్లడించిన అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నిరాకరించారు. ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మానంలో భారత్ పాత్ర అందరికీ తెలిసిందేనని, భారత ప్రభుత్వం ఆఫ్ఘన్లో భారీస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇటలీలో జి8 విదేశాంగ మంత్రుల సమావేశంలో భాగంగా ఆఫ్ఘన్- పాక్‌లపై చర్చలు జరుగుతాయని చెప్పారు.