ఆఫ్ఘనిస్థాన్లో ప్రాణాంతక వైమానిక దాడులు జరపడంలో అమెరికా సిబ్బంది ఘోర తప్పిదాలు చేశారని ఆ దేశ మిలటరీ జరిపిన దర్యాప్తులో తేలింది. ఆఫ్ఘనిస్థాన్లో గత నెలలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో అనేక మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడానికి ఈ తప్పిదాలు కారణమయ్యాయని న్యూయార్క్ టైమ్స్ బుధవారం వెల్లడించింది.
మే- 4న పశ్చిమ ఆఫ్గనిస్థాన్ ప్రాంతంలో వైమానిక దాడులు జరిపిన సందర్భంగా అమెరికా సిబ్బంది కొన్ని తప్పులు చేశారు. ఈ కారణంగా పలువురు అమాయక ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని అమెరికా మిలటరీ అధికారి ఒకరు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అమెరికా జరుపుతున్న వైమానిక దాడులపై ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తీవ్ర అంసతృప్తితో ఉంది.
ఈ దాడులు నిలిపివేయాలని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. మే- 4న అమెరికా వైమానిక దళం బాలా బులక్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో 140 మంది పౌరులు మృతి చెందారు. ఈ దుర్ఘటన అనంతరం దేశంలో వైమానిక దాడులు నిలిపివేయాలని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే అమెరికా మిలిటరీ దీనిపై దర్యాప్తు జరిపింది. ఆనాటి దాడిలో 20-30 మంది పౌరులు మృతి చెందారని, 60-65 మంది తీవ్రవాదులు హతమైనట్లు మిలిటరీ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్ మానహ హక్కుల సంఘం మాత్రం దాడిలో 97 మంది పౌరులు మృతి చెందినట్లు తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది బాలలున్నారని వెల్లడించింది.