పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరత్ ప్రావీన్స్‌లో సోమవారం జరిగిన బాంబు దాడిలో 12 మంది పౌరులు మృతి చెందారు. ఈ దాడిలో మరో 26 మంది గాయపడ్డారని భద్రతాధికారులు వెల్లడించారు. దాడిలో మృతి చెందినవారిలో ఓ మహిళ, బాలుడొకరు ఉన్నారు. జిల్లా పోలీసు చీఫ్‌కు ఈ బాంబు దాడిలో తీవ్ర గాయాలయ్యాయి.
ఈ నెలలో జరగబోతున్న ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష ఎన్నికలకు విఘాతం కలిగిస్తామని తాలిబాన్ తీవ్రవాదులు ఇప్పటికీ హెచ్చరికలు పంపారు. తాజా బాంబు దాడి కూడా వారి పనేనని భద్రతా యంత్రాంగం అనుమానిస్తోంది. అధ్యక్ష ఎన్నికలను ప్రశాంతంగా జరగనిచ్చేందుకు ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా, నాటో సేనలు ఇటీవల కాలంలో తాలిబాన్ తీవ్రవాదులపై దాడులను ముమ్మరం చేశాయి.
సమస్యాత్మక ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు చురుగ్గా సాగుతుండటంతో, తాలిబాన్ తీవ్రవాదుల కూడా ప్రతీకార దాడులకు పూనుకుంటున్నారు. ఆగస్టు 20న ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం ఆప్ఘనిస్థాన్‌లో జరిగిన హింసాకాండలో ముగ్గురు అమెరిన్లతోసహా, మొత్తం ఐదుగురు విదేశీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.