Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫ్ఘనిస్థాన్‌లో తీవ్రవాదులపై కీలక ఆపరేషన్

Advertiesment
అమెరికా సైనికులు
దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో వేలాది మంది అమెరికా, స్వదేశీ సైనికులు తాలిబాన్ తీవ్రవాదులపై కీలక ఆపరేషన్ చేపట్టారు. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో సుస్థిరతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో తొలి ప్రధాన సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది. యుద్ధ ట్యాంకులు, హెలికాఫ్టర్ల సాయంతో సాగుతున్న ఈ ఆపరేషన్‌లో హెల్మండ్ ప్రావీన్స్‌లోని తాలిబాన్ స్థావరాలపై దాడులు చేస్తారు. గురువారం వేకువజామున 1.00 గంటల ప్రాంతంలో సైనిక చర్య ప్రారంభమైంది.

గత కొంతకాలంగా ఆఫ్ఘనిస్థాన్‌లో సంకీర్ణ సేనలు యుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సైనిక ఆపరేషన్ ప్రారంభమైన ఈ ప్రాంతం ప్రపంచంలో నల్లమందు (మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే పంట) ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి అత్యధికంగా నల్లమందు ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది.

ఈ ప్రాంతంపై తాలిబాన్లు గట్టిపట్టు కలిగివున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఆగస్టు 20న జరగబోతున్న అధ్యక్ష ఎన్నికలలోగా ఈ ప్రాంతాన్ని తాలిబాన్ తీవ్రవాదుల నుంచి విడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అధికారిక యంత్రాంగం తాజా సైనిక చర్యకు ఖాంజార్ (స్టైక్ ఆఫ్ ది స్వోర్డ్) అనే పేరు పెట్టింది. ఇందులో 4000 మంది అమెరికా సైనికులు, 650 మంది ఆఫ్గనిస్థాన్ భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. బ్రిటన్ దళాలు కూడా హెల్మండ్, పొరుగునున్న కాందహార్ ప్రావీన్స్‌లలో తీవ్రవాదులను ఏరివేసేందుకు గత వారం చిన్న ఆపరేషన్ చేపట్టింది.

Share this Story:

Follow Webdunia telugu