ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో గత కొన్నేళ్లుగా పోరాడుతున్న అమెరికా సైన్యానికి కొత్త అధిపతిగా జనరల్ స్టాన్లీ మెక్‌క్రిస్టల్ నియమితులయ్యారు. అమెరికా, నాటో సేనలకు ఇకపై ఆయన నేతృత్వం వహించనున్నారు.
కాబూల్‌లో సోమవారం ఎటువంటి ఆర్భాటం లేకుండా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రస్తుత దళాధిపతి జనరల్ డేవిడ్ మెక్‌కీర్నాన్ నుంచి మెక్‌క్రిస్టల్ ఈ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక దళాల మాజీ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించిన మెక్‌క్రిస్టల్ ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాన్ని మరింత సాంప్రదాయేతర మార్గంలోకి తీసుకెళతారని నిపుణులు భావిస్తున్నారు.
2001లో ఆప్ఘనిస్థాన్‌లో తీవ్రవాదులపై యుద్ధం ప్రకటించిన అమెరికా, నాటో సేనలు ఇప్పటివరకు అక్కడ నానాటికీ పెరుగుతున్న హింసాకాండను నియంత్రించలేకపోయాయి. ప్రస్తుతం ఆఫ్ఘన్ యుద్ధ రంగంలో 56 వేల మంది అమెరికా సైనికులు, 32 వేల మంది ఇతర దేశాల సైనికులు ఉన్నారు.