ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్-పాకిస్థాన్ దేశాల సరిహద్దులు జీహాద్‌కు కేంద్రబిందువుగా మారాయని అమెరికా స్పష్టం చేసింది.
ఆఫ్గన్, పాక్ సరిహద్దులు జీహాద్‌కు కేంద్రబిందువుగా మారాయని అమెరికా రక్షణశాఖామంత్రి రాబర్ట్ గేట్స్ తెలిపారు.
జార్జ్ వాషింగ్‌టన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాల సరిహద్దులు జీహాద్‌కు నిలయంగా మారాయని, అయినా కూడా తాము ఆఫ్గనిస్థాన్ దేశాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే కాబుల్ ప్రాంతంపై తాలిబన్లు కబ్జా చేసివున్నారని, తాము అక్కడినుంచి వైదొలగితే అల్‌ఖైదా ఉగ్రవాదులతో కలిసి మరింత పుంజుకోగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో పరిస్థితిని చక్కబెట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ఇప్పుడు తమవద్ద రెండవ మహాశక్తిని ఎదుర్కొనే శక్తి ఉందని, లేకుంటే వారు (ఉగ్రవాదులు) పలు దేశాలపై, ప్రతినిధులపై, ప్రజల ఆస్తిని నష్టపరిచేవిధంగా దాడులకు పాల్పడుతారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖామంత్రిణి హిల్లరీ క్లింటన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అల్‌ఖైదా తన ప్రధాన కార్యాలయాన్ని ఆఫ్గనిస్థాన్ తీసుకువెళుతుందా లేదా అనేది తాము ఇప్పుడే చెప్పలేమని, కాని ఒకవేళ తాలిబన్లు ఆఫ్గనిస్థాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకుంటే ఇరువర్గాలు బలోపేతం అవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.