ఆఫ్గనిస్థాన్‌లో తిష్టవేసిన తాలిబన్ ఉగ్రవాదుల పని పట్టేందుకు గాను అమెరికా అదనపు బలగాలను పంపాలని నిర్ణయించింది. ఇందుకోసం మరో 13 వేల మంది సైనిక బలగాలను పంపేందుకు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సమ్మతించారు.
ఆఫ్గన్‌కు మరో 21 వేల మంది దళాలను పంపుతామని గత మార్చి నెలలో ఆయన ఓ ప్రకటన చేశారు. ఈ సంఖ్యకంటే తక్కువగా దళాలను పంపేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. ఈ అదనపు దళాలు ప్రధానంగా సహకార దళాలుగా ఉంటాయి. అంటే ఇంజనీర్లు, వైద్య సిబ్బంది, ఇంటెలిజెన్స్ నిపుణులు, సైనిక పోలీసులు ఉంటారని పోస్ట్ పేర్కొంది.
దీంతో ఆఫ్ఘన్‌కు పంపేందుకు ఒబామా ధ్రువీకరించిన అమెరికా దళాల సంఖ్య 34 వేలకు చేరుకుంటుంది. సాధారణంగా పెంటగాన్, వైట్‌హౌస్ మద్దతు దళాల మోహరింపును బహిరంగంగా ప్రకటించదు. మాజీ అధ్యక్షుడు బుష్ ఇరాక్‌కు పంపిన 20 వేల పోరాట దళాలను గురించి మాత్రమే ప్రకటించారు. వారి వెంట వెళ్లిన మద్దతు దళాల సంఖ్యను వెల్లడించని విషయం తెల్సిందే.