నేపాల్ దేశ కొత్త ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ వచ్చే ఆగస్టు నెలలో భారత్ పర్యటనకు విచ్చేయనున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన, తమ మంత్రివర్గాన్ని విస్తరించాల్సి ఉండటంతో, ఆయన భారత పర్యటన ఆలస్యమైంది.
వచ్చే నెలలో ఈజిప్టులో జరుగనున్న అలీనోద్యమ సదస్సుకు ముందే ఆయన భారత్‌లో పర్యటించాల్సి వుంది. అయితే, నేపాల్‌లో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన పర్యటన వాయిదా పడినట్టు ఆదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక విదేశీ పర్యటనకు రానుండటం ఇదే తొలిసారి.
అంతకుముందు కేంద్ర విదేశాంగ మంత్రి శివశంకర్ మీనన్ నేపాల్‌కు వెళ్లి, మాధవ్‌ను భారత్‌కు రావాల్సిందిగా ప్రధాని మంత్రి తరపున ఆహ్వానించారు. అయితే, 22 పార్టీల సంకీర్ణ ప్రభుత్వ నేపాల్ మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడంతో ఆయన పర్యటన ఆలస్యమైంది. మాధవ్ కుమార్ పర్యటన తేదీలు అధికారికంగా ఖరారు కావాల్సివుంది.