అమెరికాలో సోమవారం రెండు సబ్‌వే మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 70 మంది గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్- మేరీలాండ్ రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలోని రైల్వే మార్గంపై సోమవారం అంతర్జాతీయ కాలమానం ప్రకారం 2100 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
రెండు స్టేషన్ల మధ్య నిలిచిపోయిన రైలును వెనుక వచ్చిన మరో రైలు ఢీకొట్టిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో రెండు రైళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మృతి చెందినవారిలో వెనుక నుంచి రైలును ఢీకొట్టిన రెండో రైలు డ్రైవర్ కూడా ఉన్నాడు. ప్రమాదంలో రెండో రైలు డ్రైవర్ కంపార్ట్‌మెంట్ పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంది. గాయపడిన 70 మందిలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు అధికారిక వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.