పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు తమ చేతిలోకి వస్తే, వాటిని అమెరికాపైనే ప్రయోగిస్తామని అల్ ఖైదా తీవ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ తీవ్రవాద సంస్థ అగ్రనేత ఒకరు మాట్లాడుతూ.. తమ చేతికి పాక్ అణ్వాయుధాలు చిక్కితే వాటి లక్ష్యం అమెరికానేనని పేర్కొన్నారు.
అమెరికన్ల చేతిలోకి అణ్వాయుధాలు వెల్లకూడదని, ముజాహిదీన్లు వాటిని తీసుకొని అమెరికన్లపై ప్రయోగించాలని దేవుడు కోరుకుంటున్నారని ఆదివారం అల్ జజీరా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్ ఖైదా కమాండర్ ముస్తఫా అబు అల్ యాజిద్ తెలిపాడు. పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో తాలిబాన్లతో పోరాడుతున్న ఆ దేశ సైన్యం యుద్ధంలో ఓడిపోతుందని తాము భావిస్తున్నట్లు చెప్పాడు.
అది పాక్ సైన్యానికి అంతం కావాలని దేవుడు కోరుకుంటున్నారన్నాడు. పాకిస్థాన్ ఆర్మీ సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతుంది. ఈ పోరాడంలో గణనీయమైన విజయాలు సాధించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆఫ్ఘనిస్థాన్‌లో అల్ ఖైదా మిలిటరీ కమాండర్‌గా భావిస్తున్న యాజిద్ 2008 ఆగస్టులో అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.
అయితే అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ను హెచ్చరిస్తూ యాజిద్ వీడియో ఒకటి మీడియాకు విడుదలైంది. ఈ వీడియోలో యాజిద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్యకు దిగితే, ముంబయి తరహా దాడులు మరిన్ని జరుగుతాయని హెచ్చరించాడు.