ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి చెందిన ఓ భారతీయ విద్యార్థి సంఘం దాడులపై స్పందించింది. భారతీయలపై జరిగిన దాడులన్నీ జాత్యహంకారంతో కూడుకున్నవి కాదని తెలిపింది.
ఆస్ట్రేలియాలో మరో ఇద్దరు భారతీయులపై దాడి జరిగిన నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ (ఎఫ్ఐఎస్ఏ) ప్రతినిధులు మాట్లాడుతూ.. భారతీయులపై జరిగిన దాడులన్ని జాతివివక్షతో జరిగినవి కాదని తెలిపారు. దేశంలో త్వరలోనే తాజా ఆందోళనకర పరిస్థితులు సద్దుమణుగుతాయని నమ్మకం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు భారతీయ విద్యార్థులపై 19 దాడులు జరిగాయి. తాజాగా జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. సిడ్నీ సీబీడీలో ఇద్దరు భారతీయ విద్యార్థులను దుండగులు గాయపరిచారు. వీరిలో ఒకరిని దుండగులు బీరు సీసాతో ముఖంపై కొట్టారు. బాధితుడి ముఖంపై కుట్లపడ్డాయి. ఈ దుశ్చర్య ఆదివారం చోటుచేసుకుందని ఏబీసీ తెలిపింది.