భారత్‌లో అవినీతిపై యుద్ధం చేస్తున్న అన్నా హజారే దాయాదీ దేశం పాకిస్థాన్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించారని వ్యక్తిగత పనినిమిత్తం భారత్ వచ్చిన పాకిస్థాన్ మానవ హక్కుల కమీషన్ నూతన ఛైర్మన్ జోహ్రా యూసఫ్ (61) పేర్కొన్నారు.
"అవినీతి పెద్ద అంశంగా మారింది, పాకిస్థాన్ ప్రభుత్వాలన్ని అవినీతిని ప్రోత్సహిస్తున్నాయి. అయితే పాకిస్థాన్‌లో పలు పెద్ద అంశాలు ఉన్నాయి. పాక్ ప్రభుత్వంతో పాటు సమాజంలో నెలకొన్న అసహనం పెద్ద అంశం" అని యూసఫ్ చెప్పారు. హజారేకు పాకిస్థాన్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని ఆమె తెలిపారు.
అవినీతిని అరికట్టగలిగితే తమ జీవితాలు మెరుగుపడతాయని సామాన్యులు భావిస్తున్నారు. అవినీతి ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉందన్నారు. అన్నా హజారే స్ఫూర్తిగా పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త ఒకరు సెప్టెంబర్ 15 నుంచి అవినీతికి వ్యతిరేకంగా దీక్షకు పూనుకున్నారు.