ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వంటిల్లు మొదలుకుని.. డ్రాయింగ్ రూమ్ దాకా చెక్క సామగ్రి వాడకం సర్వసాధారణం. ముఖ్యంగా వంటింట్లో చెక్క పాత్రలు, గరిటెల వాడకం బాగా పెరిగింది. ఎంతో ఖరీదైన ఈ చెక్క వస్తువులు సూర్యరశ్మి, పొడి వాతావరణం కారణంగా తొందరగా పాడవుతాయి. అయితే వీటిని ఉపయోగించటంలో కొన్ని చిట్కాలను పాటించినట్లయితే... ఎంతో కాలం మన్నుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సాధ్యమైనంత వరకూ వీటికి నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్తపడాలి. ఇండోర్ మొక్కలు, నీటితో నింపిన పాత్రలు ఇంట్లో అక్కడక్కడా పెట్టడం వల్ల, తేమ ఏర్పడి ఫర్నీచర్ త్వరగా పాడవకుండా ఉంటుంది.
టేకు ఫర్నీచర్ గనుక వాడుతున్నట్లయితే... ఏడాదికి రెండుసార్లు టీక్ ఆయిల్ లేదా క్రీమ్‌ను వాడాలి. వైర్ ఊల్ సహాయంతో చేతికి గ్లోవ్స్ వేసుకుని ఫర్నీచర్‌కు పట్టిస్తే, చేతికి అంటుకోకుండా ఉంటుంది.
ఓక్ ఫర్నీచర్ వాడుతున్నట్లయితే, వాటిని శుభ్రంగా తుడిచి, వెచ్చటి వెనిగర్‌తో పాలిష్ చేస్తే ఇట్టే మెరిసిపోతాయి. కొత్తగా కొనే చెక్క పాత్రలను రాత్రంతా సెడర్ వెనిగర్‌లో ముంచి ఉంచినట్లయితే, ఆయా పాత్రలు కూరల వాసనను పీల్చుకోకుండా ఉంటాయి. మరుసటి రోజు పేపర్ టవల్స్‌తో పొడిగా తుడిచేస్తే సరిపోతుంది.
సలాడ్ల కోసం వాడే చెక్క పాత్రలను సబ్బుతో కడగకుండా.. ఆలివ్ ఆయిల్‌లో ముంచిన వస్త్రంతో బాగా తుడిచి, గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఆరిన తరువాత నూనెను మళ్లీ పైపైన పూయాలి. ఈ చిన్ని చిట్కాలను పాటించినట్లయితే... మీ ఇంట్లోని ఉడెన్ ఫర్నీచర్ కొత్త అందంతో మెరిసిపోతుంది సుమా..!!